సంపాదకీయం



తెలుగును సంపూర్ణం గా  నేర్చుకోవడమంటే  కేవలం రాయడం, చదవడం, మాట్లాడడం నేర్చుకోవడం మాత్రమే  కాదు నా దృష్టిలో. తెలుగు లో  సాహిత్య సృజన చేయగలగడం.  అదెప్పుడు సాధ్య పడుతుంది?  తెలుగు లో  ఉన్న సాహిత్యాన్ని నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకోవడం, పరిచయం చేసుకోవడం కూడా విద్య తో బాటూ అలవరచుకున్న నాడు. శ్రద్ధాసక్తులతో భాషను నేర్చుకునే క్రమంలోనే రచనకు విత్తనం వేయగలిగిన నాడు.  అదుగో అటువంటి ఆలోచన కు   రూపకల్పనే ఈ "బాల కవనం".   పసి పిల్లల మనస్సులో స్వచ్ఛమైన ఊహలెన్నో ఉంటాయి. అవన్నీ పైకి చెప్పగలిగిన భాషను మనం అందజేయ గలిగితే ఈ సంచిక లో మొదటి కథ "ఒక మంచి పులి" గా బయటికి వస్తాయి.  ఇలా పిల్లలకు పత్రిక అనే ఊహ కలగజేయడానికి,   ఇప్పటి మీడియా ప్రపంచంలో పిల్లలు వ్రాయడం పట్ల శ్రద్ధ కనబరచడానికి ఈ పత్రిక ప్రారంభించబడింది. మీ అభిప్రాయాలను తెలియజేసి ఈ చిన్నారులను ఆశీర్వదించండి.